Saturday, February 26, 2011

మహాశివరాత్రి * ఆది భిక్షువు ఆనంద తాండవం

మహాశివరాత్రి తర్వాత సరిగ్గా పదిహేను రోజులకు హోలీపూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మరో పక్షం రోజులకు తెలుగు సంవత్సరాది పండుగ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పనిని ప్రారంభించదలిస్తే, అందుకు సంబంధించిన ఆలోచనలను శివరాత్రి నుంచి ఉగాది వరకు చేయాలి. హోలీ నుంచి ఉగాది ముందు రోజు వరకు ఆ పనిని సాధించేందుకు తగిన వనరులను సమకూర్చుకోవాలి. అన్నీ సమకూరిన మీదట ఉగాది నుంచి ఆ కార్యాన్ని అమలు చేయడం ఆరంభించాలి. ఆ కార్యం మోక్షానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబాభివృద్ధికి సంబంధించినదైనా కావచ్చు. శివరాత్రినాడు ఆ పని సజావుగా నడిచేటట్లు చూడవలసిందిగా ఆ మహాదేవుడిని ప్రార్థించాలి.

శివుడు అంటే మంగళకరమైన వాడు అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని చెప్పుకోవచ్చు. ఆదిభిక్షువు ఆనంద తాండవం చేసే రాత్రి శివరాత్రి. అందుకే ఈరోజున నిద్రపోకుండా జాగరణ చేయాలని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడూ పూజించని వారు కూడా ఈ ఒక్కరోజు మాత్రం శ్రద్ధాభక్తులతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందట. అందుకే ‘జన్మానికో శివరాత్రి’ అనే సామెత పుట్టింది. ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఓ ఐతిహ్యముంది.
పూర్వం బ్రహ్మవిష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది.

ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతకూ బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పాతాళం దాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు.

ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపోయింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పాడు. ‘నిజమే’ అంది మొగలిపువ్వు. దాంతో తాను ఓడిపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శపించాడు. అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు.

అనంతరం బ్రహ్మవిష్ణువులు ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్ర్తాలు, పూలమాలలు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారాలతో పూజించారు. ఆపూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్దశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించేవారు మహోన్నత ఫలాలు పొందేవిధంగా అనుగ్రహించాడు.


ఈ పర్వదినాన ఈవిధంగా అర్పించాలి

పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి. ఈ వేళ శివుడు ఆనంద తాండవం చేస్తాడంటారు. ఈ దినం సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం.

శివరాత్రిదానం మహాపుణ్యఫలం

సంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.
ఏకబిల్వం శివార్పణం...
శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.

పంచభూత లింగాలు

పంచభూతలింగాలలో ఆకాశలింగం- చిదంబరంలోనూ, వాయులింగం శ్రీకాళహస్తిలోనూ, అగ్నిలింగం అరుణాచల్‌లోనూ, జలలింగం జంబుకేశ్వర్‌లోనూ, పృథ్వీలింగం కంచిలోనూ, సూర్యలింగం కోణార్క్‌లోనూ, చంద్రనాథలింగం సీతాకుంజ్‌కొండలోనూ, యజమానలింగం ఖాట్మండులోనూ ఉన్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఉజ్జయినిలో మహాకాళుడు, మాహిష్మతిలో ఓంకారేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసిక్‌లో త్రయంబకేశ్వరుడు, చితాభూమిలో వైద్యనాథుడు, దారుకావనంలో రామేశ్వరుడు, మన్మాడ్ సమీపంలో ఘృష్ణేశుడు, వెరావల్‌లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, దాక్షారామంలో భీమేశ్వరుడు, అమరారామంలో అమరలింగేశ్వరుడు.
- డి.వి.ఆర్. భాస్కర్

Monday, February 14, 2011

కొత్తదేవుడండీ ........ కొండనే మలుచుకున్న 'కోనేటిరాయడు'


కోట్లాదిమంది ఆరాధ్యదైవమైన శ్రీవెంకటేశ్వరుని భారీ విగ్రహం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో రూపుదిద్దుకుంటోంది. 95 అడుగుల విగ్రహం భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విగ్రహం పూర్తయితే తిరుపతి వచ్చిన భక్తులంతా తిరువణ్ణామలై రావాల్సిందేనని, ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ వెంకటేశ్వరుని విగ్రహం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.

రాళ్లను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో తమిళులకు ప్రత్యేకత వుంది. తంజావూరు, మధురై, మహాబలిపురంలలోని శిల్ప సౌందర్యమే ఇందుకు నిదర్శనం. కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం మరో ఉదాహరణ. ఇదే ఆదర్శంగా తీసుకున్న శిల్పులు ఏకంగా 95 అడుగుల ఎత్తయిన తిరుమలేశుని విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మరో విశేషముంది. సాధారణంగా రాళ్లను తొలచి విగ్రహాలుగా మలుస్తారు. కానీ ఇక్కడ కొండనే విగ్రహంగా మలచడం విశేషం.

పెరుమాళ్‌గా మారిన శివుడు

తిరువణ్ణామలై నుంచి వేలూరుకు వెళ్లే దారిలో 32 కి.మీ దూరంలో వున్న గాంగేయలూరులో ఈ అద్భుతం రూపు దాలుస్తోంది. వాస్తవానికి ఈ విగ్రహం విషయంలో ముందు అనుకున్నదొకటి. కానీ జరుగుతున్నది మరొకటి. 1998లో ఇక్కడ శివుడి (చంద్రశేఖరుడు) విగ్రహాన్ని తయారు చేయాలని కంచి శంకరమఠం నిర్వాహకులు భావించారు. ఇందుకోసం గాంగేయలూరు చుట్టూ వున్న కొండలను పరిశీలించారు.

దాదాపు వంద కొండలను పరిశీలించిన తరువాత, చివరిగా 'గోపురం కొండ'ను ఎన్నుకున్నారు. ఇక్కడ తయారు చేసే విగ్రహాన్ని చెన్నై-మహాబలిపురం రోడ్డులోని ముత్తుక్కాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 22,550 చదరపు అడుగుల వైశాల్యంలో విగ్రహం తయారు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలైమామణి ముత్తయ్య స్థపతి సారథ్యంలో విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ, శివుని శిలను పెరుమాళ్‌గా మార్చాలని శంకరమఠం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ విగ్రహం తయారీ పనులు జరుగుతున్నాయి. 25 అడుగుల పీఠం ఎత్తుతో కలిపి మొత్తం 120 అడుగుల ఎత్తుతో విగ్రహం తయారవుతోంది. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. సుమారు వెయ్యి టన్నులు బరువు కలిగిన పెరుమాళ్ విగ్రహాన్ని గాంగేయలూరు నుంచి ముత్తుక్కాడు వరకు తీసుకొచ్చేందుకు మార్గమధ్యంలోని వంతెనలు తట్టుకునేస్థితిలో లేవు.

భారీ విగ్రహం అంత దూరం తీసుకొచ్చే ప్రయత్నంలో దెబ్బతినే అవకాశం కూడా వుందని నిపుణులు హెచ్చరించడంతో నిర్వాహకులు ఆందోళన చెందారు. ఈ కారణంగా విగ్రహం తయారీ పనులు నిలిచిపోయాయి కూడా. అయితే విగ్రహం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం మంచిది కాదని భావించిన గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని ఆశ్రయించారు. అప్పట్లో తితిదే పాలకమండలి నుంచి ఎన్.యువరాజ్ నేతృత్వంలోని పలువురు సభ్యులు వచ్చి ఈ పనులను పరిశీలించి, విగ్రహాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. అంతేగాక గాంగేయలూరులోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానించారు. ఎట్టకేలకు పనులు ఊపందుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నామలై, పడవేడు, రేణుకామ్మాళ్ వంటి ప్రసిద్ధ ఆలయాలున్న తిరువణ్ణామలై జిల్లాలో పెరుమాళ్ విగ్రహమున్న గాంగేయలూరు కూడా మరో పుణ్యక్షేత్రంగా మారడం ఖాయం.

- ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై