Wednesday, March 9, 2011

సప్తగిరిపై.. ఈ చరిత్ర ఏ సిరాతో !

 శ్రీవారు క్షేమమా!
వెంకన్న ఆలయ పటిష్టతపై ఆందోళన
1600 సంవత్సరాల నాటి కట్టడాలు
ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనమేలేదు

మూల విరాట్టుపై 'కొండంత' నగల బరువు
కట్టడాల కింద అంతర్వాహినిగా విరజా నది!
పునాదుల్లో నీరు చే రితే కుంగుబాటు
పద ఘట్టనలు వాహనాల ప్రకంపనల ప్రభావం

నిత్య కల్యాణం... పచ్చ తోరణంలా కళకళలాడే తిరుమలలో 1600 సంవత్సరాల కిందటి కట్టడాలున్నాయి. ఇంతటి పురాతన కట్టడాలను, నిర్మాణాలను ఎలా పరిరక్షిస్తున్నారు? ఎన్నడైనా శ్రీవారి గర్భాలయ పటిష్ఠతపై శాస్త్రీయమైన అధ్యయనాలు నిర్వహించారా? శ్రీవారి ఆలయానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా? ఇవి సామాన్యులను కాదు... చారిత్రక నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలు! శాస్త్రీయ అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టకపోతే ముప్పు తప్పకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇప్పటికే గర్భగుడి చుట్టూ ఉన్న కట్టడాలు వంగి, కుంగిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. శ్రీవారి ఆలయానికి ముప్పు ఉందన్న అంచనాకు రావడానికి అనేక కారణాలున్నాయి.

ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల గుడిలోని నాట్య మండపం... సుమారు 800 సంవత్సరాల కిందటి కట్టడం. కూలిపోయే ప్రమాదముందంటూ స్తంభాలన్నింటినీ పీకి పక్కకు పెట్టారు! శ్రీకాళహస్తిలోని గాలి గోపురం! దీని వయసు 500 సంవత్సరాలు! మరమ్మతులకు, నిర్వహణకు నోచుకోక... నిలువునా కూలిపోయింది. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి గర్భాలయం. కేవలం 125 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. పగుళ్లు వచ్చాయని, ముప్పు పొంచి ఉందని సత్యదేవుడి దర్శనాన్ని నిలిపివేసి మరీ మరమ్మతులు చేపడుతున్నారు.

తిరుమలలో నిత్య నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరుడి విగ్రహం మూడో శతాబ్దం నాటిదని అంచనా. ఈ విగ్రహం మొదట ఒక పుట్టలో ఉండేదని, దానిని గిరిజనులు పూజించే వారనే కథనం ప్రచారంలో ఉంది. ఈ విగ్రహం చుట్టూ తొండమాన్ చక్రవర్తి ప్రాకారాన్ని కట్టించాడు. ఆగమ శాస్త్ర సూత్రాలను అనుసరించి- విగ్రహం చుట్టూ కొంత ప్రదేశాన్ని వదిలేసి- చుట్టూ మూడు అడుగుల వెడల్పు ఉన్న ఒక గోడను నిర్మించాడు.

అంటే ఇప్పుడు గర్భగుడిలో ఉండే గోడ దాదాపు పదహారువందల ఏళ్ల కిందటిది. ఆ తర్వాత పల్లవులు, చోళులు, సాళువ రాజులు, నవాబులు, ఆంగ్లేయులు- ఇలా అనేక మంది పాలనలో తిరుమల ఉండింది. రాజులు మారేకొద్దీ, కాలం గడిచే కొద్దీ అనేక కొత్త కట్టడాలు వచ్చి చేరాయి. మొదట్లో గర్భగుడిపైన రాతి పలకలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో గోపురం వచ్చింది.

ఈ సమయంలో మూడు అడుగుల గోడ పెద్ద గోపురం బరువును తట్టుకోలేదని భావించి మరో మూడు అడుగుల గోడను అదనంగా నిర్మించి దానిపై గోపురాన్ని కట్టారు. అంటే ఆలయంలోని కట్టడాలకు కనీసం 400 నుంచి 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏ విధంగా చూసినా ఇవి ప్రాచీనమైనవే! జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవే! ప్రస్తుతం మూల విరాట్టుతో మొదలుకుని మొత్తం ఆలయ కట్టడం భద్రత వరకు అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేవదేవుడి దివ్య మంగళ స్వరూపం నుంచి మొదలుపెడితే...

ఇంత భారం మోయగలడా?

ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారి విగ్రహం 1700 సంవత్సరాల కిందటిదని అంచనా. నిత్యాలంకార భూషితుడైన వేంకటేశ్వరుడు భక్తులకు రమ్య మనోహరంగా దర్శనం ఇస్తుంటాడు. కానీ... మొదట్లో ఈ విగ్రహానికి ఇన్ని ఆభరణాలు అలంకరించే వారు కారు. ఇప్పుడు శ్రీవారికి 20 కిలోలకు పైబడిన కిరీటాలు కూడా పెడుతున్నారు. మొత్తంగా ఈ ఆభరణాల బరువు వంద కిలోల వరకు ఉంటుందని అంచనా.

"స్వామి వారి విగ్రహం పద్మాకారంలో ఉన్న ఒక రాతి పీఠంపై ఉంటుంది. మొదట్లో శ్రీవారికి ఇన్ని ఆభరణాలు ఉండేవి కావు. అంటే విగ్రహంపై పెద్ద బరువు ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో శ్రీవారికి పెట్టే ఆభరణాల బరువు దాదాపు వంద కిలోల వరకూ ఉంటోంది. ఇంత బరువును శిలా పీఠం తట్టుకోగలదా? దీనిపై ఇప్పటిదాకా సరైన అధ్యయనం జరిగనట్లు లేదు'' అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి తెలిపారు.

అంతేకాదు... ప్రస్తుతం శ్రీవారి ఆలయాన్ని ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నారు. వీరందరి పద ఘట్టనల ఒత్తిడి కూడా గుడి ఉన్న నేలపైనా, నిర్మాణాలపైన పడుతుంది. ప్రతి రోజూ కనీసం 50 వేల మంది నడిచిప్పుడు ఏర్పడే ప్రకంపనలపై కూడా ఎటువంటి అధ్యయనం జరగలేదు. ఒక కొండపై నిత్యం నడిచే వందలాది వాహనాల ప్రభావమూ కట్టడంపై పడే అవకాశముంది.

విరజా నది ఎక్కడ?

ఇదంతా మనకు పైకి కనిపించే కథ! కానీ... 'అంతర్వాహిని' రూపంలో మరో ముప్పు కనిపిస్తోంది. ప్రసిద్ధ ఆ లయాలను ఒక్కసారి గమనిస్తే... అవన్నీ నదులు, ఇతర జలవనరుల సమీపంలోనే వెలిశాయి. ఇలాంటి ఆలయాలు అత్యంత శక్తిమంతమైనవని, మహిమాన్వితమని పురాణాలు కూడా చెబుతున్నాయి. తిరుమల కూడా ఇందుకు మినహాయింపు కాదు.

శ్రీవారి ఆలయాన్ని కూడా 'విరజ' అనే నది సమీపంలో నిర్మించారు. (ఇది పెద్ద నదేమీ కాదు. చిన్న ప్రవాహాలను కూడా పురాణాలలో నదులుగానే అభివర్ణిస్తారు.) ఒకప్పుడు గుడి వెనక భాగంలో ఈ నది ప్రవహిస్తుండేది. అప్పటి ఆచారం ప్రకారం... శ్రీవారికి నైవేద్యం పెట్టేందుకు ఉపయోగించిన 'ఓడు' (సగం కుండ)ను ఈ నదిలో పడేసేవారు. ఈ నీటితోనే తిరుమలలోని పాత పుష్కరిణికి నీరు అందేది.

కొత్తగా వచ్చిన కట్టడాల వల్ల ఈ ప్రవాహం దిశ మారి, తర్వాత పూర్తిగా అంతర్వాహినిగా మారి ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీంతో పాత పుష్కరిణిలో నీటి చేరిక కూడా ఆగిపోయింది. "శాసనాలు, ఇతర ఆధారాల ప్రకారం చూస్తే ఒకప్పుడు విరజా నది నైరుతి నుంచి ప్రవహిస్తూ ఉండేది. విరజ తన దిశను మార్చుకోవడంవల్లే పాత పుష్కరిణిలో జలాలు తగ్గిపోయాయి. దీంతో కొత్తగా మరో పుష్కరిణి నిర్మించారు. ఇది పాత పుష్కరిణికి పశ్చిమ దిశగా ఉంది.

అంటే... బహుశా విరజా నది అంతర్వాహినిగా గుడి కింది నుంచి ప్రవహిస్తూండే అవకాశం ఉంది'' అని టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 39 సంవత్సరాలు పని చేసి, చీఫ్ ఇంజనీర్‌గా రిటైర్ అయిన ఆంజనేయ నాయుడు తెలిపారు. 1921లో జగదీశ్ అయ్యర్ రాసిన 'ద సౌత్ ఇండియన్ ష్రైన్స్' అనే పుస్తకంలో తిరుమలలో ఉన్న వివిధ కట్టడాల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ఆంజనేయ నాయుడు వాదనలను ఇది బలపరుస్తోంది.

ఉపగ్రహాలే శరణ్యం...

గర్భగుడి సమీపంలోకి అధికారులను అనుమతించరు. అందువల్ల ఆలయ పటిష్ఠతపై ఇప్పటిదాకా పకడ్బందీ విశ్లేషణలేవీ జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల గుడి కింద జల ప్రవాహ తీరును, ఇతర అంశాలను పరిశీలించడానికి ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే శరణ్యమని నిపుణులు చెబుతున్నారు. "మనకు అత్యాధునికమైన ఉపగ్రహాలు ఉన్నాయి. చారిత్రక అంశాలలో వివాదాలు వచ్చినప్పుడు ఉపగ్రహాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. సరస్వతి నది ప్రవాహ మార్గాన్ని తెలుసుకోవటానికి ఉపగ్రహాలనే ఉపయోగించారు.

సముద్రంలో మునిగిన ద్వారక శి«థిలాల ఆనుపానులు కూడా ఉపగ్రహాల వల్లే తెలిశాయి. అందువల్ల తిరుమల కొండపై జల వనరులు ఎలా ప్రవహిస్తున్నాయి? వీటి వల్ల శ్రీవారి ఆలయానికి ప్రమాదం ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఉపగ్రహ టెక్నాలజీ వాడచ్చు'' అని ఇస్రోలో ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన శేషుశర్మ వివరించారు. కోట్ల మంది భక్తులకు కొంగు బంగారమైన శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవడంపై అధికారులు ఇకనైనా దృష్టి సారించాలన్నదే అందరి విన్నపం!

అయితే ఏమిటి?

అంతర్వాహినిగా ఉన్న విరజ గుడి మధ్యలో నుంచి ప్రవహిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు ఒక్క ముక్కలో బదులివ్వాలంటే... "ఈ నీరు ఆలయ పునాదుల్లోకి చేరుకోవచ్చు. అదే జరిగితే... గుడి తట్టుకుని నిలబడగలదా? లేదా? అనే విషయంపై ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనం జరగలేదు'' అని నిపుణులు తెలిపారు. తిరుమల భూభాగం కొండరాళ్లు, మట్టితో కూడుకున్నది. ఇప్పటికీ వర్షాకాలంలో తిరుమలలో అనేక చిన్నా పెద్ద జల ప్రవాహాలు కనిపిస్తాయి.

వీటి ప్రవాహంవల్ల రాళ్ల మధ్య మట్టి కరిగి... కొండ చరియలు విరిగిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక భూగర్భంలోనే కదులు తూ మరెక్కడో బయటికి వెలువడే ప్రవాహాలు మరెన్నో ఉంటాయి. "తిరుమల ఆలయంలోనివన్నీ బాగా బరువైన నిర్మాణాలు. వీటికి వేసిన పునాదులు, నేల గట్టిగా ఉంటే- ఈ నిర్మాణాలు ఎక్కువ కాలం నిలబడతాయి. ఒక వేళ భూమి గుల్లగా మారితే - ఇవి కూడా కూరుకుపోయే ప్రమాదం ఉంది'' అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి వివరించారు.

ధ్వంస రచన!
కూల్చడంలోనే మహదానందం
ప్రాచీన మఠాలు మటుమాయం
గోపురాలు, మండపాలు నేలమట్టం

వేయికాళ్ల మండపం తాజా నిదర్శనం
చారిత్రక కట్టడాలపై టీటీడీ కాఠిన్యం
ఆలయం ,హథీరాంజీ మఠం మినహా..
మిగిలినవన్నీ కొత్త నిర్మాణాలే
కాంక్రీట్ జింగిల్‌గా తిరుమల

హైదరాబాద్ , మార్చి 6: పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరుమలకు వెళ్లిన వాళ్లు నోళ్లు వెళ్లబెడతారు. అప్పటి తిరుమలను, ఇప్పుడున్న తిరుమలను పోల్చుకోలేక పోతారు. 'అంతా బాగానే ఉంది! కానీ... ఏదో లోపించింది' అనే భావన వారిని వెంటాడుతుంది! అంతా విశాలంగా కనిపించినా... ఏదో 'ఇరుకు'గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన పవిత్రతకు లోటు లేనప్పటికీ.... చుట్టూ ఉండాల్సిన వాతావరణంలోనే మార్పు కనిపిస్తుంది.

ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, నిశితంగా పరిశీలిస్తే.... తిరుమల కూడా ఒక 'కాంక్రీట్ జంగిల్'గా మారిందనే విషయం స్పష్టమవుతుంది. ఔను నిజం! మహాద్వారానికి ముందున్న వెయ్యి కాళ్లమండపం మటుమాయమైంది. ఇప్పుడు... విశాల మైదానం కనిపిస్తుంది. (కొన్నాళ్లకు ఈ మైదానంలో మహామణి మండపం అనే మరో కాంక్రీట్ నిర్మాణం వెలుస్తుంది). నాలుగు మాడల వీధుల్లో నడుస్తున్నప్పుడు ఆధ్యాత్మిక భావనలను ఇనుమడింపజేసే వ్యాసరాజ మఠం, కంచి మఠం, అహోబిళ మఠం, వైఖానస మఠం, పెద్ద జీయర్ మఠం, చిన్న జీయర్ మఠం, ఆంధవన్ ఆశ్రమం, అనేక సత్రాలు... ఏవీ కనిపించవు.

వందల సంవత్సరాలుగా ఉన్న ఈ కట్టడాలను కూల్చివేశారు. ఇవన్నీ మరో చోటికి తరలించారు. నాలుగు మాడల వీధుల్లో ఒకప్పుడు యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన మండపాలు ఆ తర్వాత నివాసాలుగా మారాయి. అటుపైన ఆ మండపాలూ మాయమయ్యాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పుడు తిరుమలలో శ్రీవారి ఆలయ సముదాయం, ఆ పక్కనే ఉన్న హథీరాంజీ మఠం మినహా... కొండపై కనిపించే ప్రతి కట్టడమూ కనిపించే ప్రతి కట్టడమూ ఇసుక, సిమెంట్, ఇటుకల నిర్మాణమే! హథీరాంజీ మఠంలోనూ కొంత భాగాన్నీ టీటీడీ స్వాధీనం చేసుకుని, దాని రూపం మార్చేసింది. నేటి తిరుమల... మరో 'కాంక్రీట్ జంగల్'! తరతరాల కట్టడాలు... తిరుమలది 1700 సంవత్సరాల చరిత్ర.

పల్లవులు, సాళువులు, ఇలా అనేక మంది పాలకుల హయాంలో తిరుమలలో అనేక చారిత్రక నిర్మాణాలు వెలిశాయి. మూడు నాలుగు వందల ఏళ్ల క్రితం దాకా ఈ నిర్మాణాలు మూడు అంశాల ప్రాతిపదికన చేపట్టేవారు. మొదటిది... గుడిలో అప్పటికే ఉన్న నిర్మాణాలకు ముప్పు ఏర్పడితే వాటికి మరమ్మతులు చేయడం. మరమ్మత్తులకు వీలు కాకపోతే వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం. రెండోది... రాజుల కీర్తి కాంక్ష. తమ పేరు చరిత్రలో చిరకాలం నిలిచిపోవాలనుకొనే రాజులు తిరుమలలో కొన్ని కట్టడాలు నిర్మించారు.

ఈ రెండూ కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తిరుమలలో కొన్ని నిర్మాణాలు వెలిశాయి. అవి... భయం వల్ల, భద్రత కోసం వెలిసిన నిర్మాణాలు. ఉదాహరణకు... మహ్మద్ ఘజనీ దండయాత్రల సమయంలో స్థానిక రాజులు తమపైనా దాడి జరుగుతుందని భయపడ్డారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని, ఇతర విలువైన సామగ్రిని తిరుమల గుడి ప్రాంగణంలో దాచుకున్నారు. ఏడు కొండలు దాటి ఘజనీ రాలేడనేది వారి ప్రగాఢ విశ్వాసం.

ఇలా తీసుకువచ్చిన విలువైన వస్తువులను సాళువ మండపం (ప్రస్తుతం లడ్డూలు తయారు చేసే పోటు)లోని ప్రత్యేక అరలలో దాచుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతాయి. ప్రస్తుతం... తిరుమల ఆలయంలో పైన పేర్కొన్న కట్టడాలేవీ కనిపించవు. భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షలకు పెరగడంతో... వారికి వసతులు కల్పించేందుకు తిరుమలలో అనేక మార్పులు చేశారు. పురాతన ప్రాధాన్యమున్న కట్టడాలను కూడా దెబ్బతీశారు.

కూల్చడానికి రెడీ...
నిజమే! తిరుమలకు వచ్చే భక్తులకు తగిన స్థాయిలో వసతులు కల్పించాల్సిందే. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా, తొక్కిసలాటలవంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవడం అవసరమే! అయితే... వసతుల కల్పన ఎంత ముఖ్యమో, చారిత్రక కట్టడాల పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ... టీడీడీ అధికారులు ఈ రెండో కోణాన్ని విస్మరించారు.

అనేక కట్టడాలను కూల్చివేశారు. తిరుమలలో గతంలో ఆలయం ముందు సన్నిధి వీధి ఉండేది. అందులో... బొమ్మల గోపురం, మొండి గోపురం అనే రెండు గోపురాలు ఉండేవి. మాస్టర్ ప్లాన్‌కు అడ్డు వస్తున్నాయంటూ ఆ రెండింటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇదే మాస్టర్ ప్లాన్ పేరిట వెయ్యి కాళ్ల మండపాన్ని నిలువునా కూల్చేశారు. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. నాలుగు మాడ వీధుల్లోని మండపాలు, మఠాలనూ ఇలాగే కూల్చేశారు.

"ఒకప్పటి తిరుమల ఫోటోలు చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు పెంచాల్సి వచ్చింది. కానీ, టీటీడీ సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయింది. చారిత్రక కట్టడాలను కూల్చకుండా, చిన్న చిన్న మార్పులతోనే భక్తులకు తగిన వసతులు కల్పించవచ్చు. ఈ దిశగా నాతో సహా అనేక మంది తయారు చేసిన ప్రణాళికలు బూజుపట్టి పోయాయి'' అని టీటీడీలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన ఆంజనేయ నాయుడు తెలిపారు.

ప్రైవేటు రాజ్యం...
చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను కూల్చడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కట్టడం ఉనికికే ప్రమాదం వస్తుందనే భయం ఉన్నప్పుడు మాత్రం... ఆ కట్టడాన్ని మరో ప్రాంతానికి తరలించి యథాతథంగా పునర్నిర్మిస్తారు. కానీ... తిరుమలలో అనేక నిర్మాణాల విషయంలో టీటీడీ అధికారులు నిర్దయగా వ్యవహరించారు. ఒకవైపు చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను కూల్చుతూ... కొత్తగా, విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం తిరుమలలో ఎవరూ నివాసముండేవారు కాదు.

అర్చకులు కూడా ఉదయాన్నే వచ్చి రాత్రికి తిరుపతికి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత భక్తుల రాకపోకలు పెరగడంతో వారు తిరుమలపైనే ఉండటానికి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు. భక్తులకోసం సత్రాలను, కాటేజీలు నిర్మించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ... ఇప్పుడు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ చేశారు. వీవీఐపీలు ఇక్కడ కొండ అంచుల్లో సొంత కాటేజీలు నిర్మించుకున్నారు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండటం ఒక 'ప్రెస్టేజ్ ఇష్యూ'గా మారిపోయింది.

"తిరుమల వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలకు ఒక విశిష్టత ఉండాలి. అక్కడున్న నిర్మాణాలు ఒక శైలిని ప్రతిబింబించాలి. ఒక వేళ కొత్త కట్టడాలు కట్టాల్సి వచ్చినా, ఆ శైలిలోనే కట్టాలనే నిబంధనలు ఉండాలి. ప్రస్తుతం తిరుమలలో ఇవేమీ లేవు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు నిర్మాణాలు చేస్తున్నారు. దీనిని టీటీడీ అనుమతించకూడదు'' అని పురావస్తుశాఖకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంతకాలం జరిగిన కట్టడాల విధ్వంసానికి ఇకనైనా టీటీడీ ఆపాలని అంతా కోరుకుంటున్నారు.

శిథిల శిల్పం
సుందర 'మంట' పానికి వంట పోటు
ప్రమాదంలో సాళువ మండపం

పొగబారిన శిల్పాలు, స్తంభాలు
చారిత్రకు సంపదకు నిర్లక్ష్య శాపం
ఇప్పటికి ఒకసారి ప్రమాదం
నిపుణుల హెచ్చరికలు బేఖాతరు

నిత్య కళ్యాణం... పచ్చ తోరణం! నిరంతరం గోవింద నామ స్మరణం! అది... తిరుమల ఆలయం. ఆనంద నిలయం! శ్రీహరి వాసం ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం! అంతేనా? కాదు...అది ఓ చారిత్రక అద్భుతం. శతాబ్దాల చరిత గల శిల్ప కళా వైభవం. రాజులెందరో భక్తితో, శక్తితో శిలలను శిల్పాలుగా తీర్చిదిద్దిన అనేక అద్భుత శిలా మండప ప్రాకారాల నిలయం. అయితే ఆధ్యాత్మిక ఉధృతిలో చారిత్రక ప్రాశస్త్యం మసిబారుతోంది.

తిరుమల కన్నా వయసులో ఎంతో చిన్నవైన శ్రీకాళహస్తి గోపురం కాలగర్భంలో కలసి పోయింది. వరంగల్ వేయిస్తంభాల గుడి మండపం పునర్నిర్మాణం అడిగింది. అన్నవరం ఆలయం మరమ్మతుకు వచ్చింది. మరి తిరుమల! అక్కడా నిర్మాణాలు ప్రమాదపు అంచున నిలుస్తున్నాయి. తీవ్ర నిర్లక్ష్యంతో మసిబారుతున్నాయి. పెద్దల మర్యాదలకు, భక్తుల సౌకర్యాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చారిత్రక నిర్మాణాల పరిరక్షణకు ఇవ్వడం లేదు.

శతాబ్దాల వారసత్వ సంపదను భావి తరాలకు అందించే శాస్త్రీయ ప్రయత్నం జరగడం లేదు. అయితే తమ చేతిలో ఉంచుకుంటామనో, లేదా పురావస్తు శాఖకు అప్పగిస్తామనో విరుద్ధ వాదనలను ప్రతిపాదించడం తప్ప, ఆధ్యాత్మిక భక్తిని, చారిత్రక అనురక్తిని సమపాళ్లలో మేళవించే ప్రయత్నం టీటీడీ చేయడం లేదు. కొండమీద జరుగుతున్న నష్టం, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదంపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనాలు నేటి నుంచి...

అది సాళువ మండపం! నిలువెత్తు రాతి స్తంభాలతో, వాటిమీద అపురూపమైన శిల్పాలతో అలరారే నిర్మాణం. తిరుమల ఆలయానికి కాలిబాట తప్ప మరో మార్గంలేని రోజుల్లో అష్టకష్టాలు పడి కొండను చేరుకున్న భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు సాళువ ప్రభువులు నిర్మించిన మందిరమది. ఒకప్పుడు సుందరంగా కనిపించిన మండపం... ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మసిబారింది. జిడ్డుగారుతోంది. కారణం దీన్ని శ్రీవారి పోటుగా మార్చడమే! వంటను, మంటను తట్టుకోలేక ఇప్పటికే ఒకసారి ప్రమాదానికి గురైన 'పోటు' కాని ఈ పోటు క్రమంగా కుంగిపోతోంది. వేయికాళ్ల మండపాన్ని ఇంతకుముందే కోల్పోయిన తిరుమలలో ఈ చారిత్రక నిర్మాణానికీ భారీ ప్రమాదం పొంచి ఉంది.

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి పదహారు వందల ఏళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, సాళువ రాజులు, నవాబులు, ఆంగ్లేయులు- ఇలా అనేక మంది తిరుమలను పాలించారు. అప్పట్లో గుడి చుట్టూ దట్టమైన అడవులే ఉండేవి. దొంగల భయం కూడా ఎక్కువగానే ఉండేది. అర్చకులతో సహా సిబ్బంది అంతా ఉదయాన్నే వచ్చి రాత్రికి కొండ దిగి వెళ్లి పోయేవారు. కానీ... కొందరు భక్తులు మాత్రం కొండపై బస చేసేవారు. ఎంతో అలసిపోయి వచ్చిన భక్తుల కోసం శ్రీకృష్ణదేవరాయుల పూర్వీకులైన సాళువ రాజులు సువిశాలమైన రాతి మండపాన్ని కట్టించారు. రాతి స్తంభాలపై అనేక శిల్పాలను చెక్కించారు. దీనిని సాల మండపం అని కూడా పిలుస్తారు. ఈ సాల మండపమే... ఇప్పుడు 'పోటు'గా మారింది.

ఎలాగంటే... ఒకప్పుడు శ్రీవారికి కేవలం అన్న నైవేద్యాలు మాత్రమే సమర్పించేవారు. అంటే పులిహోర, చక్కెర పొంగలి వంటివి మాత్రమే నైవేద్యంగా పెట్టేవారు. ఈ ప్రసాదంలో కొంత భాగాన్ని అర్చకులు, ఆలయ నిర్వహణలో పాలుపంచుకొనే సిబ్బంది తీసుకునేవారు. మిగిలినది భక్తులకు పంచిపెట్టేవారు. ఈ నైవేద్యాలను ఆలయంలోని 'వకుళాదేవి పడి'లో తయారు చేసేవారు. అంటే... అసలైన పోటు ఇదే! ఆలయం మహంతుల చేతిలోకి వెళ్లాక అనేక మార్పులు జరిగాయి.

నైవేద్యాల జాబితాలో లడ్డు, జిలేబీ వంటి తీపి ప్రసాదాలు వచ్చి చేరాయి. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షలకు పెరిగింది. లడ్డూలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆ స్థాయిలో లడ్డూలు తయారు చేసేందుకు వకుళాదేవి మండపం (పాత పోటు) సరిపోలేదు. దీంతో.... అధికారుల కన్ను సుందరమైన సాలువ మండపంపై పడింది. పోటు... అక్కడికి మారింది. ఆ రోజు నుంచే ఇక్కడి చారిత్రక శిల్ప సంపద పొగచూరడం మొదలైంది.

పొయ్యిలతో వచ్చిన ముప్పు...

సాల మండపంలో లడ్డూల తయారీ ఎప్పుడు ప్రారంభమయిందో చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, లడ్డూల తయారీ వల్ల మండపానికి తీవ్రమైన హాని జరిగిందన్నది మాత్రం నిజం. " నేతిని బాగా కాచడానికి 100 నుంచి 140 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నేతి ఆవిరి వల్ల రాళ్లపై మైక్రో పార్టికల్స్ చేరతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రాళ్లపైన ఉన్న పెచ్చులు ఊడిపోతాయి. సాల మండపంలోకి పోటును మార్చడం వల్ల జరిగిన తొలి హాని ఇది. నిరంతరం రగిలే వేడి వల్ల రాతిలో చీలిక ఏర్పడి, పగిలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పోటులో ఉన్న స్తంభాలు, పైకప్పు పరిస్థితి అదే'' అని టీటీడీలో ఉన్నతస్థానంలో పని చేసిన ఒక నిపుణుడు హెచ్చరించారు.

దాదాపు ఐదారేళ్ల క్రితం పోటులోని పైకప్పు నుంచి ఒక రాతి పలక కింద పడింది. పోటుకు ఉన్న ముప్పు తొలిసారి అప్పుడే బయటపడింది. పోటులో ఉన్న 12 స్తంభాలు వాలిపోతున్నాయని కూడా అప్పుడు గమనించారు. వాటికి తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "పోటు ప్రాంతానికి ఎవరినీ రానివ్వరు. ఇప్పుడు పోటులోని స్తంభాల పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, వెంటనే చర్యలు తీసుకోపోతే మాత్రం ప్రమాదం తప్పదు'' అని ఆ మాజీ అధికారి ఒకరు తెలిపారు.

శిల్పాలు పోయాయి..

లడ్డూల తయారీ ప్రారంభించడంతో స్తంభాలపై ఉన్న శిల్పాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఒక్క మండపంలో మాత్రమే కాదు. గుడిలోని ఇతర ప్రాంతాలలో ఉన్న శిల్పాలపైనా సమగ్ర అధ్యయనం జరగలేదు. దీనికి టీటీడీ అధికారుల నుంచి ఎప్పుడూ అనుమతి లభించకపోవటమే ప్రధాన కారణమనేది పురావస్తు శాఖ అధికారులు వాదన. "తిరుమల ఆ«ధ్యాత్మిక కేంద్రమే. ఎవరూ కాదనరు. కానీ, అక్కడ అపురూపమైన చారిత్రక సంపద కూడా ఉంది. దీనిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రాచీన కట్టడాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. అవసరమైతే మరమ్మత్తులు చేయాలి. రసాయనాలతో శుద్ధి చేయాలి. లేకపోతే ప్రమాదాలు తప్పవు.

పోటులో ఉన్న శిల్పాలకు ఇప్పటి దాకా ఎప్పుడూ రసాయన శుద్ధి జరగలేదు. జరిగితే కొన్ని శిల్పాలైనా బాగుపడి ఉండేవి'' అని పురావస్తు శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ అధికారి వాదనను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ కూడా సమర్థిస్తున్నారు. "దేవాలయం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు. ఒక కట్టడం కూడా. ఆ విషయాన్ని విస్మరిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి తాజా ఉదాహరణ శ్రీకాళహస్తి గోపురం. ఈ గోపురం ప్రమాదంలో ఉందని నేను అనేకసార్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ దృష్టికి తీసుకు వచ్చాను. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. కూలిపోయిన తర్వాత అందరూ వాపోయారు'' అని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఏం చేయాలి?

గతంలో పోటులో ప్రమాదం జరిగినప్పుడు లడ్డూల తయారీని ఆలయం బయటకు తరలించాలనే వాదన వినిపించింది. అయితే, ఆగమ శాస్త్రం దీనికి అంగీకరించదని కొందరు బలంగా వాదించారు. అయితే, ఈ వాదనలో పసలేదని నిపుణులు పేర్కొంటున్నారు. "వకుళా దేవి పడిలో గతంలో అన్నప్రసాదాలు మాత్రమే తయారుచేసేవారు. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే చిన్న లడ్డూలను బయటే తయారు చేసేవారు.

అంతే కాకుండా 1970లలో భక్తులకు కలాకండ్‌ను ప్రసాదంగా ఇచ్చేవారు. ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యేది. నిజానికి... స్వామి వారికి ఒక ప్రోక్తం (51 లడ్డులు) నైవేద్యంగా పెడతారు. వాటిని తీసుకువచ్చి మిగిలిన లడ్డూల్లో కలుపుతారు. అందువల్ల నైవేద్యం పెట్టే 51 లడ్డూలను మాత్రం లోపల తయారు చేసి... మిగిలినవి బయట తయారు చేస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం కాదు'' అని తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వ్యవహరించిన ఆంజనేయ నాయుడు తెలిపారు.

నిపుణులు రావాలి...

తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. అనేక శిల్పాలు, శాసనాలు, చారిత్రక కట్టడాలకు నిలయం. అయితే... నేటి ప్రభుత్వం, అధికారులు తిరుమల ఆధ్యాత్మిక ప్రాభవాన్ని కొనసాగించడంపైనే దృష్టి సారించారు. చారిత్రక ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని సురక్షితంగా భావి తరాలకు అందించాలంటే తక్షణం మొత్తం కట్టడాల భద్రతపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరగాలి. దాదాపు ఇదే లక్ష్యంతో తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలనే ప్రతిపాదన చేశారు.

కానీ... తిరుమల కేవలం ఒక 'పురావస్తు కట్టడం' మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రాధాన్యంలేని చారిత్రక కట్టడాలను పురావస్తు శాఖకు అప్పగిస్తే భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. కానీ... తిరుమల తీరు ప్రత్యేకం. ఇక్కడి ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. దీనికోసం టీటీడీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.